చెన్నూర్‌రూరల్: అడవులు, ప్లాంటేషన్ కాలితే చిన్నచిన్న జీవరాశులు చనిపోవడమే కాకుండా పర్యావరణానికి నష్టం వాటిళ్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్ కుమార్ పేర్కొన్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం మండలంలోని పొన్నారం నీలగిరి ప్లాంటేషన్ సమీపంలోని చాకెపల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు, ప్లాంటేషన్ మీదుగా రాకపోకలు సాగించే వారు సిగరెట్, బీడీలు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పొలాలు ఉన్న వారు సాగు తర్వాత మిగిలిన గడ్డి, చెత్తను తగులబెట్టి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారన్నారు. దీంతో గాలులు వీచిన సమయంలో ఆ మంటలు అడవిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అధికారులకు సమాచారం అందించి అడవుల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, వాచర్ ఓదెలు, సంజీవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.