
అమురాజుల శ్రీదేవి
బెల్లంపల్లి: బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవిని ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 2004 ఎన్నికల్లో శ్రీదేవి ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఆమె బీజేపీలో చేరడంతో అధి నాయకత్వం పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. మాజీ ఎమ్మెల్యే కావడంతో అధిష్టానం ఆమైపె సానుకూలత చూపినట్లు తెలుస్తోంది.
ఏమాజీ ఏం చేస్తారో..?
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ కూడా బెల్లంపల్లి అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. అభ్యర్థిత్వం ఖరారు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. శ్రీదేవి, ఏమాజీల మధ్యనే పోటీ కనిపించింది. ఆఖరుకు అధిష్టానం శ్రీదేవి పక్షాన మొగ్గు చూపడంతో ఏమాజీ ఆశలు అడియాశలయ్యాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఏమాజీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పోటీకి అవకాశం దక్కలేదు. ఈ విషయమై ఆయనను సంప్రదించగా.. పార్టీ తనకు అన్యాయం చేయదని భావిస్తున్నానని, ఒకవేళ శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లయితే నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
బయోడేటా
పేరు : అమురాజుల శ్రీదేవి
జన్మస్థలం : కాగజ్‌నగర్
తల్లిదండ్రులు : కాంపల్లి అర్జున్, మల్లిక
విద్యాభ్యాసం : ప్రాథమిక, హైస్కూల్, ఇంటర్మీడియెట్ బెల్లంపల్లిలో, డిగ్రీ మంచిర్యాలలో పూర్తి చేశారు
రాజకీయప్రవేశం : 2004లో టీడీపీ తరఫున ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజనలో ఆసిఫాబాద్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి 2011లో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2012లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.