ఓట్ల చోరీపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల చోరీపై అప్రమత్తత అవసరం

Jun 17 2026 5:15 AM | Updated on Jun 17 2026 5:15 AM

టీపీసీసీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలకు శిక్షణ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీ యత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అప్రమత్తం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్‌ ముదిరాజ్‌ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై బీఎల్‌ఏలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు కృషి చేయాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపుల వంటి అంశాలపై పూర్తి అవగాహనతో పనిచేసి ప్రజలకు సహాయపడాలన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచు కోవాలన్నారు. అంతకుముందు బీఎల్‌ఏల శిక్షణ కమిటీ చైర్మన్‌, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు బీఎల్‌ఓలు వచ్చినప్పుడు వారితో కలిసి ఎస్‌ఐఆర్‌లో తప్పక పాల్గొనాలన్నారు. నెల రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ వారిచ్చే ఫారాలను ప్రజలతో సరిగ్గా పూర్తి చేయించి అధికారులకు ఇవ్వాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపైనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీకి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతుతో వాటిని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యంగా వలస వెళ్లిన వారి వివరాలను ఓటరు జాబితాలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, నగర మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, ప్రత్యేక ట్రైనర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు సత్తూర్‌ చంద్రకుమార్‌గౌడ్‌, సాయిబాబా, రాములుయాదవ్‌, పసుల రాజు, వి.మహేందర్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ అవేజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement