వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం

May 31 2026 12:36 AM | Updated on May 31 2026 12:36 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: వివిధ రంగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల (ఎస్‌హెచ్‌జీ)తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా ప్రతి నియోజకవర్గంలో మహిళాశక్తి సూపర్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో ఎస్‌హెచ్‌జీలను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేస్తామన్నారు. భవిష్యత్‌లో రైస్‌ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలోనూ మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతకుముందు ఆయనను ఎస్‌హెచ్‌జీలు ఘనంగా సన్మానించి, జ్ఞాపికకను అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి, మెప్మా పీడీ మహమ్మద్‌ యూసుఫ్‌, ఇన్‌చార్జి డీఎంసీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

యువత నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): యువత నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో కౌమార దశ విద్యార్థుల కోసం మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్‌కు పునాదులని, వారికి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పాలనా విధానాలపై అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మాక్‌ పార్లమెంట్‌ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత పెంపొందుతాయన్నారు. అదేవిధంగా కౌమార దశ విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సైబర్‌ భద్రత, బాల్య వివాహాల నియంత్రణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. మంచి ఆరోగ్యం, సమతుల ఆహారం, సురక్షిత జీవన విధానం విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు తమ లక్షాలను స్పష్టంగా నిర్దేశించుకొని క్రమశిక్షణతో ముందుకుసాగాలని, విద్యతోపాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పార్లమెంట్‌ కార్యకలాపాలను అనుకరిస్తూ వివిధ ప్రజాసమస్యలపై చర్చించి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ నర్సింహులు, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement