చెరువులో మునిగి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుడు మృతి

Apr 5 2026 9:06 AM | Updated on Apr 5 2026 9:06 AM

నారాయణపేట రూరల్‌: స్నానానికి వెళ్లిన యువకుడు ఈతరాక నీటిలో మునిగి మృతి చెందిన ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఖాదర్‌ తన మిత్రులు, సోదరులతో కలిసి మండలంలోని కోటకొండ గ్రామంలో బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఉదయం గ్రామ శివారులోని చెరువుకట్ట వైపు వెళ్లిన ఖాదర్‌ స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఆయన ఆచూకీ దొరకలేదు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యువకుడు

అనుమానాస్పద మృతి

కొత్తకోట రూరల్‌: తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడంటూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ, కాటేదన్‌కు చెందిన దోమ అరుణమ్మ కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (27) డీసీఎం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈనెల 2న డీసీఎంను తీసుకుని బళ్లారికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొత్తకోట మండలం విలియంకొండ గ్రామ సమీపంలో ఓ దాబా దగ్గర కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆపి అంతలోనే అస్వస్థతకు గురికావడంతో తోటి డ్రైవర్లు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి అరుణమ్మ తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఉరేసుకొని

వ్యక్తి ఆత్మహత్య

రాజోళి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వడ్డేపల్లి మండలంలోని రామాపురంలో జరిగింది. శాంతిగనర్‌ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రామస్వామి(40) 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. తాగుడుకు బానిస కావడంతో పదేళ్ల కిందట భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

అడవిపంది దాడిలో గాయపడిన

రైతు మృతి

జడ్చర్ల: పొలంలో అడవి పంది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని ఉదండాపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం వ్యవసాయ పనులు చేసుకుంటున్న గొంగండ్ల రామకృష్ణ(50)పై అడవి పంది దాడి చేసింది. దాడిలో కడుపులోని పేగులు బయటకు రాగా స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఆరుగురికి గాయాలు

వెల్దండ: మండలంలోని నారాయణపూర్‌ బస్‌స్టేజీ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం చోటుచుసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మండలంలోని నారాయణపూర్‌ బస్‌స్టేజీ సమీపంలో ఎదురుగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన కారు బస్సును ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో హైదరాబాదులోని పిసల్‌బండకు చెందిన డ్రైవర్‌ అసీఫ్‌అహ్మద్‌, అర్ఫన్‌, ఫరీదాబేగం, సల్మా, మహ్మద్‌జానీ, సఫా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు మరో 33మంది ప్రయాణికులున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెల్దండ పోలీసులు పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌ వెంకట్‌ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌ అసీఫ్‌అహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement