మాగనూర్: మండల రెవెన్యూ అధికారులు అలాగే పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. మక్తల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు వడ్వాట్ గ్రామం నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి సైతం ఇదే విధంగా పదికి పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే టిప్పర్ల దగ్గరకు చేరుకున్న పోలీసులు వాటిని పట్టుకోకుండా వదిలేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్‌కు సమాచారం అందించగా తహసీల్దార్ ఆదేశాలతో ఆర్‌ఐ శ్రీశైలం సిబ్బందితో కలిసి టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయినా పోలీసులు టిప్పర్లను పట్టుకోకుండా వదిలేశారు. దీంతో స్థానిక అధికారులు, పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తే కేసులు నమోదు చేసే అధికారులకు టిప్పర్లలలో అక్రమ రవాణా కనబడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వదిలేసిన టిప్పర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


