వెల్దండ: భూ వివాదం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన వెల్దండలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల మహేశ్ (30) శుక్రవారం రాత్రి గ్రామం నుంచి తన వ్యవసాయం పొలంలోని ఇంటికి కారులో వెళ్తుండగా.. అప్పటికే పక్కా ప్రణాళికతో దారి కాచి ఉన్న దుండగులు టిప్పర్‌తో కారును ఢీ కొట్టారు. అనంతరం మహేశ్‌పై రాళ్లతో దాడిచేసి హతమార్చారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. గ్రామస్తుల సమాచారం మేరకు శనివారం వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తితో పాటు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేసుకొని వివరాలు సేకరించారు. మహేశ్ తలపై మోదిన బండరాళ్లపై రక్తపు మరకలను గుర్తించారు. ఈ క్రమంలో మృతుడికి తన కుటుంబ సభ్యులతో భూ వివాదం ఉన్నట్లు గుర్తించారు. పథకం ప్రకారం టిప్పర్ మహేశ్ కారును ఢీకొట్టి హత్యచేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతుడి భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. కాగా, టిప్పర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం


