పిడుగుపాటుతో మహిళా రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో మహిళా రైతు మృతి

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

వంగూరు: మండలంలోని నిజాంబాద గ్రామానికి చెందిన మహిళా రైతు ఇడమోని లక్ష్మమ్మ (34) సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. లక్ష్మమ్మ తన వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటను తూర్పార పడుతుండగా వర్షం రావడంతో ఆమె కూలీలతో పాటు కొంతదూరం వెళ్లి నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత వేరుశనగ కుప్పపై కప్పిన కవర్‌ గాలికి లేచిపోవడంతో దానిని సరిచేసేందుకు వెళ్తుండగా లక్ష్మమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త వెంకటయ్యకు కళ్లు కనబడకపోవడంతో ఆమెనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణ ం

రాజాపూర్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాజాపూర్‌ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్‌ రాష్ట్రం బుక్‌సర్‌ జిల్లా నవాన్‌నగర్‌కు చెందిన మంజి పాశ్వన్‌ (31) పోలేపల్లిసెజ్‌లో గల ధర్మోకేబుల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం రోజు మాదిరిగా పనికి వెళ్తూ జాతీయ రహదారి పక్క నుంచి వెళ్తుండగా జడ్చర్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య చంపకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ

వృద్ధురాలి మృతి

వనపర్తి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ 2 శశిధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన గోపిరెడ్డి శాంతమ్మ (70) జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న తన కుమార్తె మల్‌రెడ్డి సుమలత ఇంటి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి వెళ్లడానికి రామాలయం బస్‌స్టాప్‌ వద్ద రోడ్డు దాటుతుండగా బస్టాండ్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన బైక్‌ ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శాంతమ్మను కుమార్తె వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది. ఘటనపై మృతురాలి కుమార్తె మల్‌రెడ్డి సుమలత ఫిర్యాదు మేరకు సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

అప్పులబాధతో

వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా: అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని చెక్‌పోస్టు ప్రాంతంలో నివసిస్తున్న నాగరాజు (50) వ్యవసాయ పొలాలను లీజ్‌కు తీసుకొని పంటలు సాగుచేసేవాడు. కొంతకాలంగా వ్యసాయంలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులబాధ భరించలేక సమీపంలోని బ్రిడ్జిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన ముడావత్‌ లక్ష్మణ్‌ (57) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్‌ఐ కురుమయ్య వివరాల మేరకు.. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని జీవించే ముడావత్‌ లక్ష్మణ్‌ కుమారుడు ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. నాటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లోనే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పాన్‌గల్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సర్పంచ్‌ ఉషా లింగానాయక్‌, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్‌ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement