మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి.. విచారణ త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని వీసీ హాల్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులతో పాటు అదృశ్య కేసులు, ఎన్‌బీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసు పారదర్శకంగా విచారణ చేసి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రధానంగా సున్నితమైన ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. నేరాల నియంత్రణ కోసం నిత్యం వాహనాల తనిఖీలు చేపట్టాలని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి కట్టడి కోసం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ ఎన్.బిరత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ ఉన్నారు.
● విద్యార్థులు, యువకులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రాణాలకు ముప్పు అనే విషయాన్ని గ్రహించాలని ఎస్పీ జానకి అన్నారు. అరైవ్–అలైవ్‌లో భాగంగా స్థానిక రిషి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదన్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఐటీ కోర్ టీం ఎస్‌ఐ రవి, రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య, చంద్రకళ పాల్గొన్నారు.


