వనపర్తిలో తీవ్ర ‘ఉద్రిక్తం’ | - | Sakshi
Sakshi News home page

వనపర్తిలో తీవ్ర ‘ఉద్రిక్తం’

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

లైంగిక దాడి ఘటనలో బాలిక తరఫున

పోరాడిన నేతలపై కేసులు

పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట రాజకీయ పార్టీల నేతల బైఠాయింపు.. నిరసన

వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న చిన్నారిపై వార్డెన్‌ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఘటన జరగగా.. బుధవారం వెలుగులోకి రావడం, విషయం బయటకు రాకుండా యాజమాన్యం, లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్‌పై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం, పాఠశాలలో సామగ్రి ధ్వంసం చేసిన విషయం విధితమే. బాలిక తరుఫున పోరాడిన పలువురు రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి అరెస్ట్‌చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆయా పార్టీల నాయకులు, ముస్లిం మతపెద్దలు, యువకులు పోలీస్‌స్టేషన్‌కు భారీగా చేరుకున్నారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌ గేటు ఎదుట సుమారు పదిమంది కానిస్టేబుళ్లను గస్తీ ఉంచి మీడియా, బాధితుల తరుఫు వారిని, అరెస్ట్‌ చేసిన నాయకుల తరుఫు వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలకు మాత్రం లోనికి వెళ్లే వెసులుబాటు కల్పించడంతో అక్కడున్న ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన నేతకు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తూ, మిగతా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎనిమిది మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన..

అధికార పార్టీ అండదండలతో పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి తమను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని నాయకులు నందిమళ్ల అశోక్‌, మెకానిక్‌ శ్రీను తదితరులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, ఆయా కులసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి పోలీసుల చర్యలను తప్పుపడుతూ నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, అఽధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌ హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసుల తీరును తప్పుబట్టారు. అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులకు గురికావద్దని పోలీసులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్‌గౌడ్‌, పెద్దిరాజు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్‌, కౌన్సిలర్లు మురళీసాగర్‌, శ్రీకర్‌గౌడ్‌, నాయకులు సమద్‌, స్టార్‌ రహీం, జోహర్‌ హుస్సేన్‌, సూర్యవంశం గిరి, యుగంధర్‌రెడ్డి, చిట్యాల రాము, సీపీఎం నాయకుడు పరమేశ్వరాచారి, సీపీఐ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement