జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో అందించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యంగా భూ సర్వే, రెవెన్యూ సంబంధిత సమస్యలు, గృహ నిర్మాణ పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, మున్సిపాలిటీ, పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై మొత్తం 90 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, జెడ్పీసీఈఓ డీపీఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని మోడల్ బేసిక్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి ఎవరూ సెల్‌ఫోన్ తీసుకువెళ్లకూడదని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ కూలిపోవడాన్ని గమనించిన ఆమె వెంటనే దానిని తిరిగి నిర్మించాలని సూచించారు. అలాగే అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ పాఠశాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 13,218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,176 మంది హాజరవగా.. 18 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది.


