కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్ వాటర్ లెవల్స్
● శ్రీశైలం డ్యాంలో 837 అడుగుల ఎత్తులో నీటిమట్టం
● గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం
● వచ్చేనెలలో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశం
● ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్
నీటి ఎత్తిపోతలకు
ఇక్కట్లు..
ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్‌ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో కేఎల్‌ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రతిరోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
కొల్లాపూర్: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్‌ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
837 అడుగుల దిగువకు..
గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్‌లో బ్యాక్ వాటర్ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది.
మోటార్లకు మరమ్మతు..
కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్‌లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్‌లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్‌లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని మిషన్ భగీరథకు మళ్లించి.. కేఎల్‌ఐ మోటార్లకు మరమ్మతు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
కేఎల్‌ఐ అప్రోచ్
కెనాల్‌లో పారుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్


