మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు రైతుభరోసా నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, అనంతరం రైతు భరోసా నిధుల విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 48 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,15,923 మంది రైతులకు రూ.104,77,74,728 విడతల వారీగా 45 రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలోని 2,15,923 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున తొలి విడత నిధులు సోమవారం వారి ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని యాసంగి పంటలను లాభదాయకంగా సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


