మక్తల్‌లో హై‘టెన్షన్’..!
మంత్రి వాకిటి ఇలాకాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో కలకలం
● తీవ్ర ఉద్రిక్తత.. 6వ వార్డులో ఎన్నిక వాయిదా
● బీజేపీ నాయకుల ఆందోళన
● బాధితులను పరామర్శించిన నాయకులు
● నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి చందాపూర్‌కు చేరుకొని సంఘటన వివరాలను మహదేవప్ప భార్య సత్తెమ్మను అడిగి తెలుసుకున్నారు. మహదేవప్పకు చెందిన సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై మహదేవప్ప కూతురుతో ఫిర్యాదు తీసుకోవడంతో బీజేపీ నాయకులు పోలీసులపై మండిపడ్డారు. భార్య ఉండగా కూతురుతో ఎందుకు తప్పుడు వివరాలతో ఫిర్యాదు తీసుకున్నారని బీజేపీ నాయకులు నాగూరావు నామోజీ, కొండయ్య, రతన్‌పాండురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదులో ఏముందో తమకు తెలియాలని, అప్పటి వరకు పోస్టుమార్టం చేయనీయబోమని పట్టుబట్టారు.
నారాయణపేట/ మక్తల్: రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గ కేంద్రం మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ మున్సిపాలిటీని ఎలాగైనా కై వసం చేసుకోవాలనే ఉద్దేశంతో విపక్ష అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్డులో బీజేపీ గెలుస్తుందని సర్వే నివేదికలు రావడంతో అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు కొందరు టార్గెట్ చేసి భయపెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎలాగైనా మక్తల్ మున్సిపాలిటీని దక్కించుకోవాలని ఎంపీ డీకే అరుణ గత రెండు రోజులుగా మక్తల్ మకాం వేసి.. కౌన్సిలర్లను గెలిపించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా 6వ వార్డు కౌన్సిలర్ విజయానికి సైతం వ్యూహం చేస్తుండడంతో విజయం దగ్గరలో ఉన్నట్లు తేలింది. దీంతో అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక మహదేవప్పను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలింగ్‌కు ముందురోజు మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడంతో పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
తల్లి ఆశీర్వాదంతో ప్రచారం..
6వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప మొదటి తన తల్లి అనంతమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. తాజాగా కొడుకు మృతితో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. నా కొడుకు గెలుస్తాడనుకుంటి ఇలా చనిపోతాడని అనుకోలేదంటూ రోదించింది. నా కొడుకుకు చాలామంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే విషయం కొంత వరకే తనకు తెలుసని.. ఇంకా మిగతా విషయాలు తనకు చెప్పలేదని వాపోయింది. నా కొడుకును బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పోలింగ్ వాయిదా
మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆకస్మిక మృతి సంఘటనతో పోలింగ్ వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలెం శివయ్య పేర్కొన్నారు.
అసలు ఫోన్ చేసిందెవరు?
ఆత్మహత్యకు పాల్పడిన మహదేవప్పకు రెండు రోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నదేవరోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. తన భార్యకు ఫోన్ ఇచ్చి ఇంట్లోకి వెళ్లిపోయి బెడ్‌రూంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడం.. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన భార్య దగ్గరకు వెళ్లి ఫోన్ తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోవడంతో మహదేవప్ప మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహదేవప్ప ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక అధికార పార్టీ ఒత్తిళ్లకు భయపడి చేసుకున్నాడా.. అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఫోన్ కాల్ డాటాలో ఏముందో తేలనుంది.
ముమ్మాటికి రాజకీయ హత్యనే..
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చందాపూర్‌కు వెళ్లి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో దమ్ముంటే పోటీ చేసి గెలవాలని ఇలా బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. గిరిజన వార్డు మెంబర్లు అవమానాల గురిచేయడం చూస్తుంటే ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీల రాజకీయ హత్యేనని ఆరోపించారు.
మక్తల్‌లో హై‘టెన్షన్’..!


