పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మక్తల్: మహదేవప్ప మృతిపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఇందుకు బాధ్యులైన మక్తల్ సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలు వింటే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. మహదేవప్ప కుటుంబానికి బీజేపీ రాష్ట్ర కమిటీ నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులను భయపెడితే సహించేది లేదన్నారు. మహదేవప్ప కుటుంబానికి పార్టీ తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు.
బెదిరింపులకు భయపడే ఆత్మహత్య
మక్తల్: మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడే ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహదేవప్ప ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో కలిసి మక్తల్‌కు చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు తీసుకుని పోస్టుమార్టానికి పంపించడం సరికాదన్నారు. భార్య ఉండగా కూతురితో ఎందుకు ఫిర్యాదు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులతో గంటపాటు వాగ్వాదం జరగగా.. అనంతరం కుటుంబ సభ్యులతో మళ్లీ ఫిర్యాదుతీసుకున్నారన్నారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. ఆయన మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొద్దిరోజులుగా బీజేపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కోస్గిలోనూ ఇటీవల ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను సహించేది లేదని, బీజేపీ కార్యకర్తలు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొండయ్య, నాగూరావు నామోజీ, ఎన్నికల ఇన్‌చార్జి అమర్నాథ్, భాస్కర్, రాజశేఖర్‌రెడ్డి, బాల్‌రాంరెడ్డి, కర్నిసామి, సోంశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.


