ఫోన్ పే, గూగుల్ పే తో ఓట్లు కొనుగోలు
● మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్రెండ్
● ఓటుకు రూ.2,500 వరకు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. గతంలో నగదు, బహుమతులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులు, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ యాప్‌లను వినియోగిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా కొందరు అభ్యర్థులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఓటు వేస్తే వెంటనే గూగుల్ పేలో డబ్బు పంపిస్తాం.. అనే సందేశాలు కొన్ని డివిజన్లలో వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట, కొత్త గంజ్, కొత్త చెరువు, సంజయ్‌నగర్, మోనప్పగుట్ట, శ్రీనివాస్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, దివిటిపల్లి, పాలకొండ, మార్కెట్ ఇలా పలు డివిజన్లలో డిజిటల్ పేమెంట్ ద్వారా ఓట్ల కొనుగోలు జరుగుతున్నట్లు వినికిడి. అధికార పార్టీకి దీటుగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు వెనుకాడడం లేదు. ఓడిపోతే చెల్లించిన డబ్బులను మళ్లీ రికవరీ చేసుకోవడానికి ఆధారంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ఓటుకు రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. ఎన్నికల సంఘం, అధికారులు ఈ కొత్త ధోరణిపై నిఘా వేసింది. సైబర్ సెల్ సహకారంతో డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తోంది. ఒకే ప్రాంతానికి చెందిన మొబైల్ నంబర్లకు అనూహ్యంగా డబ్బు బదిలీలు జరగడం గమనిస్తే విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ మార్గంలో అయినా ఓటు కోసం డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమే. ‘ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు. మొత్తంగా, మున్సిపల్ ఎన్నికల్లో క్యాష్ ఫర్ ఓటు పద్ధతి ఇప్పుడు పే ఫర్ ఓటుగా మారింది. టెక్నాలజీని వాడి ప్రజాస్వామ్యాన్ని మలినం చేసే ఈ కొత్త ట్రెండ్‌పై ఎన్నికల అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలని ప్రజాస్వామిక వాదులు కోరుకుంటున్నారు.


