నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరం: ఎంపీ
పాలమూరు: వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించినట్లు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె మహబూబ్‌నగర్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరం ఉందని, దానిని త్వరలో తీసుకొస్తామని, ఇప్పటికే రూ.వేల కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చినట్లు తెలిపారు. చెత్తసేకరణ వ్యవస్థ ఏర్పాటు, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, సీనియర్ సిటిజన్స్‌కు ఇంటి పన్నుల్లో 30 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అర్బన్ హౌసింగ్, పార్కులు, క్రీడా మైదానాలు, వాణిజ్య సముదాయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామన్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, అమృత్ పథకం కింద రూ.400 కోట్ల, 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్పొరేషన్‌తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఆర్‌ఓబీలు మంజూరు చేసుకున్నామని, కార్పొరేషన్‌లో విలీన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రెయినేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అప్పన్నపల్లి నుంచి చించోళి వరకు బైపాస్ డీపీఆర్ సిద్ధమైందన్నారు.


