‘సామాజిక’ చైతన్యం’
● ఓటుకు అమ్ముడుపోవద్దంటూ సూచనలు
● సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్టింగులు
● మార్పునకు బీజం వేస్తున్న సామాజిక మాధ్యమాలు
అచ్చంపేట: మున్సిప్‌ల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. నేతలు ప్రచారంలో పోటాపోటీగా కొనసాగిస్తుండగా ఇటు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు హోరెత్తుతున్నాయి. స్ఫూర్తిదాయక పోస్టింగులు కొత్తకొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. తమ స్నేహితులు, బంధుమిత్రులకు షేర్ చేయడానికి యువత ఆసక్తి చూపుతోంది. అందరిలో చైతన్యం నింపుతుంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, టిట్‌టాక్ మొదలైన సామాజిక మాధ్యమాలు అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. గతంలో దుష్పచార రాతలు క్షణాల్లో వైరల్ అయ్యేవి. ఇప్పడిలా కాదు ఏదీ మంచి, ఏదీ చెడు అనే కోణం నుంచి ప్రజలు అలోచిస్తుండడం శుభ పరిమాణం. చెడును మొగ్గలోనే తుంచివేస్తున్నారు. ఒకవేళ తెలిసీ తెలియక ఎవరైనా పోస్టింగ్ చేస్తే అలాంటిది సదరు గ్రూపు నుంచి తొలగించడమో, లేకపోతే మందలించి వదిలేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు సామాజిక మాధ్యమాల్లో కొత్తదనం తొణికిసలాడుతోంది. ప్రతి పౌరుడు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా రాతలు ఉంటున్నాయి. అలాగే మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండడానికి సామాజిక మాధ్యమాల రాతలు చైతన్యం నింపుతున్నాయి.
మచ్చుకు కొన్ని..
ఏపాటి వాడో చూడు.. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు. ఏపాటి వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు ఇప్పటి వరకు ఏం చేసాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు పెట్టని టోపీ చూడు.
ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఒక్క నిమిషం అలోచించి వేసే ఓటు జీవితాన్ని మార్చేస్తుంది.
ఐదేళ్లు పాలించే నాయకుడు ఓటు కోసం మీకిచ్చే లంచం రూ.500 అంటే రోజకు 27 పైసలు మాత్రమే. బిక్షగాళ్లు కూడా 27 పైసలు తీసుకోరు. అలోచించు డబ్బు కావాలా..మంచి నాయకుడు కావాలా..?
ప్రజల మీద బతికే వాళ్లకు కాదు. ప్రజల కోసం బతికే వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుందాం.. అప్పడే ఓటుకు విలువ.
ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. పదవి అనేది అనుభవించడానికి కాదు పది మందికి సాయం చేయడానికి అని నిరూపిస్తాడు.


