ఎలా గెలుద్దాం!
ఏం చేద్దాం..
నగర డివిజన్లలో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు
కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే మంత్రి జూపల్లి కృష్ణారావు కసరత్తు మొదలైంది. ఈసారి ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. గత పది రోజులుగా పూర్తి సమయం కొల్లాపూర్ మున్సిపాలిటీకే కేటాయిస్తున్నారు. నిత్యం 5 నుంచి 6 వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా, ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. ప్రచార పర్వంలో భాగంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ వార్డులను ఇప్పటివరకు మూడుసార్లు చుట్టేశారు. కొల్లాపూర్‌లోని ఆయన ఇంటిలో వార్‌రూం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రచార తీరును పర్యవేక్షిస్తున్నారు. మంత్రిగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలతో పాటు మరెక్కడ ప్రచారంలో పాల్గొనకుండా కొల్లాపూర్‌కే పరిమితమయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాకాలో కోస్గి, మద్దూరు చైర్మన్ పీఠాలను దక్కించుకునేందు కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నిరతరం వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో సైతం పాల్గొంటున్నారు. కొడంగల్ తో పాటు కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల బాధ్యతలు సైతం తానే చేపట్టగా కొడంగల్ కంటే ఎక్కువగా కోస్గి మున్సిపాలిటీపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. నిత్యం ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు.


