ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: పీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, కార్పొరేషన్, మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర భద్రత విధానాన్ని శనివారం ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. బ్యాలెట్ పత్రాల నిల్వ చేసే ప్రాంతంతో పాటు కౌంటింగ్ హాల్‌లో ఏర్పాటు చేయాల్సిన భద్రతపై సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర మూడంచెల భద్రత తప్పనిసరిగా అమలు చేయాలని, కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనధికార వ్యక్తులకు అవకాశం లేకుండా కఠినమైన ప్రవేశ నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు వేర్వేరు మార్గాల ద్వారా ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జనసంచారం అధికంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను ముందే కేటాయించి ట్రాఫిక్ సజావుగా నడిచే ప్రణాళిక రూపొందించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్‌టీ) అందుబాటులో ఉండాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీస్ పహారా కొనసాగించాలన్నారు. ఆమె వెంట ఎన్నికల సెల్ డీఎస్పీ గిరిబాబు, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, మోతీరామ్, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
● డివిజన్ 11లో ఉన్న బండమీదిపల్లిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రహారీ లేని దగ్గర తాత్కాతిక బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.


