ఎన్నికల నిబంధనలు పాటించాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాస్‌బాబు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో నిబంధనలను పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాస్‌బాబు సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఎన్నికల ప్రచార ఖర్చు నిర్వహించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని, పోటీ చేయు అభ్యర్థి ప్రచారం కోసం చేసే ప్రతి ఖర్చు కూడా బ్యాంకు అకౌంట్ నుంచి విత్ డ్రా చేయాలని సూచించారు. కార్పొరేషన్‌లో పోటీ చేసే అభ్యర్థి వారి ప్రచార నిమిత్తం గరిష్టంగా రూ.1,50,000 వరకు, మున్సిపాలిటీలో వార్డుమెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,00,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అన్ని లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల ఖర్చులన్నింటినీ అభ్యర్థి ఎన్నికల ప్రయోజనం కోసం తెరిచిన బ్యాంకు ఖాతా నుంచి క్రాస్డ్ అకౌంట్ పే చెక్కు ద్వారా చెల్లించాలని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం దృష్ట్యా, అభ్యర్థి ఎన్నికల ప్రక్రియలో ఒకే వ్యక్తి లేదా సంస్థ నుంచి రూ.20 వేల కంటే ఎక్కువ విరాళం లేదా రుణాన్ని నగదు రూపంలో స్వీకరించరాదని సూచించారు. రూ 20 వేల కంటే ఎక్కువ ఉన్న అన్ని విరాళాలు/రుణాలను అభ్యర్థి ఖాతా చెల్లింపుదారు చెక్కు లేదా డ్రాఫ్ట్ లేదా ఖాతా బదిలీ ద్వారా స్వీకరించాలని సూచించారు. వాహనంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన ఏదైనా మద్యం, ఆయుధాలు ఇతర అక్రమ వస్తువులు దొరికితే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల లోపు పోటీచేసిన ప్రతి అభ్యర్థి విధిగా తాము నిర్వహించిన ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధించిన మునిసిపల్ కమిషనర్‌కు సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, టైటస్‌పాల్, జగన్‌మోహన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


