నిర్లక్ష్యంతోనే అధిక శాతం ప్రమాదాలు: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో వెళ్లాలని, రోడ్డుపై సిగ్నల్స్‌ను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఏఎస్పీ రత్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్‌రావు, మోటార్‌వెహికల్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు, రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు, పీయూ అధికారులు కృష్ణయ్య, రవికుమార్, గాలెన్న, అర్జున్‌కుమార్, చిన్నాదేవి, ఈశ్వర్‌కుమార్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.


