మంత్రి ఇలాకాలో హస్తం హవా
ఓటుహక్కు
వినియోగించుకున్న డీసీసీబీ చైర్మన్..
● శ్రీరంగాపురంలో మిశ్రమ ఫలితం
● చెరో మూడు స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ, సీపీఎం
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం బుధవారంతో ముగిసింది. మూడోవిడతలో పెబ్బేరు, శ్రీరంగాపురం, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జరగగా.. పోలింగ్ ముగిసే సమయానికి 85.55 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత స్టేజ్–2 ఆర్వో సారథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయే వరకు శ్రీరంగాపురం, పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 80 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యం చాటుకోగా, బీఆర్‌ఎస్ ఆశించిన మేర స్థానాలు దక్కించుకుంది.
శ్రీరంగాపురంలో..
జిల్లాలో అతి చిన్న మండలం శ్రీరంగాపురంలో మొత్తం ఎనిమిది గ్రామాలుండగా.. రెండు పంచాయతీల్లో కాంగ్రెస్, మరో రెండు పంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. మరో నాలుగు గ్రామాల్లో రెబల్స్ కై వసం చేసుకోవడం గమనార్హం.
ఉనికి చాటుకున్న బీజేపీ, సీపీఎం..
మూడోవిడతలో సీపీఎం, బీజేపీ చెరో మూడు సర్పంచ్ స్థానాలు దక్కించుకొని ఉనికి చాటుకున్నాయి. బీజేపీ పాన్‌గల్ మండలంలో ఒక స్థానం, చిన్నంబావి మండలంలో రెండు స్థానాల్లో తెలుపొందగా.. సీపీఎం పాన్‌గల్ మండలంలో రెండు, వీపనగండ్ల మండలంలో ఒక స్థానం దక్కించుకున్నాయి. తొలి, రెండోవిడతలో ఆశించిన మేర స్థానాలు రాకపోయినా.. తుదివిడతలో ఉనికి కాపాడుకున్నాయనే వాదనలు ఆయా రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి.
110 స్థానాలకు 59 స్థానాలు కై వసం
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, మాగనూరు, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల్లో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 110 జీపీలకు గాను 59 స్థానాలు హస్తగతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు 25 స్థానాల్లో సర్పంచులుగా గెలుపొందారు. ఎంపీ డీకే అరుణ అండతో బీజేపీ మద్దతుదారులు 17 మంది సర్పంచులుగా విజయం సాధించారు. మరో 9మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు.
డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తన స్వగ్రామం పాన్‌గల్ మండలం కేతపల్లిలో బుధవారం ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు సైతం అధికసంఖ్యలో గ్రామాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.


