నల్లమలలో హస్తం హవా..
● చివరి విడతలో మెజార్టీ గ్రామాలు కై వసం
అచ్చంపేట: జిల్లాలో నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ విడతలో 134 సర్పంచ్, 1,064వార్డులకు ఎన్నికలు జరగగా.. మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. పలుచోట్ల అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. బుధవారం ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మొత్తంగా కాంగ్రెస్ 84, బీఆర్‌ఎస్ 37, బీజేపీ 1, ఇతరులు 12 గెలుపొందారు. 18 ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 102 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. సర్పంచుల ఫలితాలను అధికారికంగా ప్రటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు ఆర్‌ఓలు ధ్రువపత్రాలు అందజేశారు.
కాంగ్రెస్‌లో వర్గపోరు
కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా కొన్నిచోట్ల పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ చేసి నువ్వా.. నేనా.. అన్నట్లుగా తలపడ్డారు. అచ్చంపేట మండలం నడింపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇద్దరూ ఓటమిని చవిచూశారు. సొంత పార్టీలోనే ఓట్లు చీల్చుకోవాల్సి రావడంతో మూడో వ్యక్తి గెలుపొందారు. ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడగా ఎమ్మెల్యే మద్దతు తెలిపిన వ్యక్తి ఓడిపోగా.. రెబల్ అభ్యర్థి గెలుపొందారు.
మండలాల వారీగా పరిశీలిస్తే..
మూడో విడతలోనూ అధికార కాంగ్రెస్ అధిక్యం ప్రదర్శించిన కొన్ని మండలాల్లో బీఆర్‌ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. చారకొండ మండలంలో ఎన్నికలు జరిగిన 14 పంచాయతీల్లో సగం.. సగం సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. లింగాల మండలంలో కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 8 చొప్పున గెలిచింది. అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాల్లో కాంగ్రెస్ అధిక్యం కనబర్చింది. ఈ మండలాల్లో బీఆర్‌ఎస్ వెనకబడగా.. బీజేపీ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆశించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థులు చాలాచోట్ల ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మహిళలు అధికంగా అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.


