ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: స్థానిక క్రికెట్ క్రీడాకారులు ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో కాక వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ లీగ్‌లో పాల్గొనే మహబూబ్‌నగర్ జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లమర్రి రోడ్డు సమీపంలో గల క్రికెట్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్‌లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జట్లు పాల్గొంటాయని తెలిపారు. ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందన్నారు. ప్రతి జట్టులో 15 మంది క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శనను చాటాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాస్థాయి ఎంపికల్లో దాదాపు 75 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, మన్నాన్, ముఖ్తార్‌అలీ, ఆబిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


