నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నడిగడ్డ..అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది. ఏకగ్రీవం పోనూ మిగిలిన 92 జీపీల్లో సర్పంచ్ స్థానాలకుపోలింగ్ జరగగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. అయితే గద్వాల నియోజకవర్గంలో పోటీ అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కాకుండా.. హస్తంలో వర్గాల మధ్యే కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాలకు చెందిన మద్దతుదారులు నువ్వా, నేనా అన్నట్లు పోటీపడ్డారు. 839 వార్డు స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
అటు 56.. ఇటు 26
షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల పరిధిలో 106 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 82 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇందులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి చెందిన మద్దతుదారులు 56.. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గానికి చెందిన 26 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు.
మూడో స్థానానికి బీఆర్‌ఎస్..
2019 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ జీపీ ఎన్నికల్లో సత్తా చాటి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. హస్తం హవా చాటగా.. కారు తలకిందులైంది. బీజేపీ మద్దతుదారులు తొమ్మిది గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలుపొంది రెండో స్థానంలో నిలవగా.. బీఆర్‌ఎస్ ఐదింట గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది.
గద్వాలలో హోరాహోరీగా సాగిన పోరు
సర్పంచ్‌లు, వార్డులు అత్యధికంగా
‘హస్త’గతం
ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వర్గాల మధ్యే పోటీ


