ప్రశాంతంగా తొలి విడత పోలింగ్
మహబూబ్‌నగర్ క్రైం: మొదటి విడత ఎన్నికల సందర్భంగా 1188 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్‌స్టేషన్స్‌తో పాటు సమస్యాత్మక గ్రామాలను ఎస్పీ డి.జానకి సందర్శించి భద్రత విధులను పర్యవేక్షించారు. ప్రధానంగా వీహెచ్‌ఎఫ్ సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రూట్ మొబైల్స్ బృందాలతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అనుక్షణం పర్యవేక్షించారు. ముఖ్యంగా ధర్మపూర్, రాజాపూక్, తిరుమలాపూర్, నవాబ్‌పేట, లింగంపల్లి, గురుకుంట, కారుకొండ, మహమ్మదాబాద్, కొండారెడ్డిపల్లి, గండేడ్, వెన్నచేడ్ గ్రామాల్లో పర్యటించి సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఓటరు క్యూలైన్‌లు పరిశీలించారు. అన్ని గ్రామాల్లో ఉన్న పరిస్థితులను సెట్ ద్వారా అధికారుల తెలుసుకున్నారు.
టాస్‌లో వరించిన అదృష్టం
కల్వకుర్తి రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా మండలంలోని తోటపల్లి 7వ వార్డు సభ్యుడిగా జోగు వెంకటయ్య టాస్ వేయడం ద్వారా గెలుపొందారు. 7వ వార్డులో 134 ఓట్లు ఉండగా.. 130 పోలయ్యాయి. ఇందులో జోగు వెంకటయ్యతోపాటు ప్రత్యర్థి జోగు వీరయ్యకు 65 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయగా.. బీఆర్‌ఎస్ మద్దతుదారు వెంకటయ్యను అదృష్టం వరించింది.


