రాజాపూర్‌లో అత్యధికం..
● మహమ్మదాబాద్‌లో అత్యల్పం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఐదు మండలాల్లోని 129 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. 83.04 శాతం పోలింగ్ నమోదైంది. రాజాపూర్ మండలంలో అత్యధికంగా ఓటింగ్ జరగగా.. మహమ్మదాబాద్ మండలంలో అత్యల్పంగా నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 33,918 మంది ఉండగా 29,407 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 86.70 శాతం నమోదైంది. గండేడ్ మండలంలో 31,295 మంది ఓటర్లు ఉండగా.. 24, 217 మంది ఓటేశారు. ఇక్కడ 77.38 శాతం పోలింగ్ జరిగింది. నవాబ్‌పేట మండలంలో మొత్తం ఓటర్లు 38,535 మంది ఉండగా 33,544 మంది ఓటు వేయడంతో 87.05శాతం నమోదైంది. రాజాపూర్ మండలంలో 20,925 మంది ఓటర్లు ఉండగా...18,824 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 89.96 శాతం పోలింగ్ జరిగింది. మహమ్మదాబాద్ మండలంలో 30,871 మంది ఓటర్లు ఉండగా.. 23,173 మంది ఓటేయడంతో 75.06 శాతం నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో మందకోడిగా సాగింది. ఆ తర్వాత ఓటర్లు క్యూ కట్టారు. జిల్లావ్యాప్తంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తలేదు.
రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దంపతులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.


