మద్యం మత్తులో స్నేహితుల ఘర్షణ
● కత్తితో పరస్పర దాడులు
● ముగ్గురికి తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
● గద్వాల జిల్లాకేంద్రంలో కలకలం
గద్వాల క్రైం: మద్యం మత్తులో స్నేహితులు ఘర్షణపడి కత్తితో పరస్పర దాడులు చేసుకున్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో బీసీ కాలనీకి చెందిన కుర్వ వంశీ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి స్నేహితులైన కుర్వ వంశీ, అరవింద్ (ఐడీఎస్‌ఎంటీ కాలనీ), బన్నీ (హమాలీ కాలనీ), అనిల్ (నల్లకుంట), వసంత్ (సెంకడ్ రైల్వేగేట్)లకు షేరేల్లి వీధికి చెందిన సంతోష్ మందు పార్టీ ఇచ్చాడు. వారందరూ అర్ధరాత్రి దాటే వరకు ఫొటో స్టూడియోలోనే మద్యం తాగారు. వీరిలో సంతోష్ అనే యువకుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వసంత్ మరో స్నేహితుడైన బుల్లెట్ వంశీ (బీసీ కాలనీ)కి ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించాడు. అందరూ కలిసి మద్యం తాగుతున్న క్రమంలో వివాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఫొటో స్టూడియోలో పనిచేసే వసంత్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడి.. స్టూడియో నుంచి బయటికి పంపించారు. అయితే బయటికి వెళ్లిన వసంత్.. రోడ్డుపై హంగామా చేస్తూ స్టూడియోలో ఉన్న యువకులను పరుష పదజాలంతో దూషించాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో ఫొటో స్టూడియోలోకి వెళ్లి అరవింద్‌ను గాయపరిచాడు. ఈ క్రమంలో అరవింద్, బుల్లెట్ వంశీలు వసంత్ వద్ద ఉన్న కత్తిని లాక్కొని విచక్షణారహితంగా దాడిచేశారు. కత్తి పోట్లకు గురైన వసంత్ తప్పించుకొని రోడ్డుపైకి చేరుకున్నాడు. అక్కడే రాత్రి విధులు నిర్వర్తిస్తున్న పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది గమనించి.. కత్తి పోట్లకు గురైన ముగ్గురు యువకులను పోలీసు వాహనంలోనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వసంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అరవింద్, బుల్లెట్ వంశీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం వెనుక పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. లేక ప్రేమ వ్యవహారమా.. ఆర్థిక పరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రంలో రెండు రోజుల క్రితం చికెన్ సెంటర్ నిర్వాహకుడిపై అకారణంగా కత్తితో దాడికి పాల్పడిన ఘటనను మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విచారణ చేస్తున్నాం..
జిల్లా కేంద్రంలోని వంశీ ఫొటో స్టూడియోలో మద్యం మత్తులో యువకులు పరస్పర దాడులు చేసుకున్న ఘటనపై విచారణ చేపడుతున్నాం. మందు పార్టీలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నాం. సీసీ కెమెరాల సహాయంతో అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాం. ప్రస్తుతం ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నాం. ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం.
– శ్రీను, సీఐ, గద్వాల


