ఈసారి ఇంటినుంచి ఓటు లేనట్లే!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రెండేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేని, చేతగాని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతుందన్న వాదనలు ఉన్నాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ నేటికీ రాలేదు.
గత ఎన్నికల్లో ఇలా..
గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఇంటినుంచే ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా 12–డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అధికారులు వారు ఇచ్చిన అడ్రస్‌కు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామగ్రితో వెళ్లి ఓటు వేయించారు.
ఇబ్బందులు పడే అవకాశం
ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయంలోగా కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది. కాదూ అని వారిని వదిలేస్తే ఓటింగ్ శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతోపాటు ఓటర్లు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
● అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు
● పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వని ఎన్నికల సంఘం


