కల్వకుర్తిలో భారీ చోరీ
40 తులాల బంగారం,
రూ.6 లక్షల నగదు అపహరణ
కల్వకుర్తి టౌన్: వారం రోజులుగా తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కేశవనగర్‌లో ఊర్కొండపేట ఆలయ పూజారి శ్రీనివాస్‌శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 30న తన భార్య కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లగా, పూజారి ఊర్కొండపేట దేవాలయంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో పూజారి భార్య సోమవారం ఇంటికి వచ్చి చూడగా తలుపునకు ఉన్న తాళం విరిగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి భర్తకు ఫోన్ చేసింది. బీరువాలోని 40 తులాల బంగారం, రూ.ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు శ్రీనివాస్‌శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకట్‌రెడ్డి క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించారు. సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


