చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి
బిజినేపల్లి: మండలంలోని శాయిన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద కొండయ్య (75) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండయ్య చేపలు పట్టుకోవడానికి మమ్మాయిపల్లిలోని మార్కండేయ చెరువు వద్దకు వెళ్లాడు. వల వేసే క్రమంలో ప్రమాదశావత్తు చెరువులో పడి మరణించాడు. కుటుంబసభ్యులు రాత్రి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చేపల కోసం వెళ్లి ఉంటాడనే అనుమానంతో ఆదివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిపై తేలియాడుతూ కనిపించాడు. దీంతో కుటుంససభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కొండయ్య కుమారుడు నిరంజన్‌ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వివాహిత బలవన్మరణం
కల్వకుర్తి టౌన్: క్షణికావేశంలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నివాసముండే స్రవంతి (37) భర్త ప్రవీణ్‌తో కలిసి కళాంజలి పేరుతో లేడీస్ టైలర్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేది. అయితే శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఉదయం మరో మారు గొడవ పడగా స్రవంతి మనస్థాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు భర్తకు సమాచారం ఇచ్చి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి అదృశ్యం.. కేసు నమోదు
ఊట్కూర్: మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ అనే యువకుడు అదృశ్యమవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్ ఆదివారం తెలిపారు. ఉదయ్‌కుమార్ శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం లేచి చూడగా ఇంట్లో కనపించలేదు. ఫొన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబసభ్యులు అంతా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో భార్య, యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి
చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి


