రెండేళ్లలో జీపీలకు పైసా ఇచ్చింది లేదు
పాలమూరు: హిల్ట్ పేరిట రూ.లక్షల కోట్ల అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ తెర తీసిందని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చుకున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్లే సర్పంచ్ అని.. నలుగురు పెద్దమనుషులు నిర్ణయం చేస్తున్నారన్నారు. ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోని సర్పంచ్‌లను ఎన్నుకోవాలి తప్పా.. కోటి, అర కోటి రూపాయలకు వేలం పాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బిల్లులు రాక సర్పంచ్‌లు అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం చూశామన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జీపీలకు నయా పైసా రాలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదన్నారు. ఎన్నికల కమిషన్ బలవంతపు ఏకగ్రీవంపై సుమోటోగా కేసులు నమోదు చేయాలన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సీఎం చెబుతున్నారు. అభివృద్ధి జరిగింది కేంద్రం ఇచ్చిన నిధులతోనే అనే విషయం ఓటర్లు గమనించాలన్నారు. బీజేపీ పక్షాన నిలబడి అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాల గెలుపునకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో వేధింపులకు గురిచేసి అధికార పార్టీ కండువా కపుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేవలం హడావుడి చేస్తున్నాడని, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందన్నారు. హిందూ దేవతలను రేవంత్‌రెడ్డి అవమానించాడని, దేవుళ్లపై ఒట్టుపెట్టి అధికారంలోకి వచ్చిన విషయం మరిచిపోయినట్లు ఉన్నాడని విమర్శించారు.
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగింది
వేలం వద్దు.. ఓట్లు వేసి సర్పంచ్‌ను గెలిపించుకోండి
ఎంపీ డీకే అరుణ


