కోయిల్‌సాగర్.. జలహోరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో నీటిని విడుదల చేశారు. మే రెండో వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కురిసిన వర్షాలతో ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్లు అధికంగా వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు గేట్లను పలుమార్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు చరిత్రలోనే ఈ ఏడాది ఒక రికార్డుగా నమోదైంది. 1947లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1954లో పనులు పూరయ్యాయి. అలుగుస్థాయి వరకు 26.6 అడుగులుగా ఉన్న ప్రాజెక్టు.. 1984 వరకు 30 ఏళ్ల పాటు అలుగు పారడంతోనే నీటి విడుదల కొనసాగింది. అయితే కరువు కాటకాలతో ప్రాజెక్టు చాలా సార్లు నిండని పరిస్థితులు కూడా వచ్చాయి. 1984లో ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచి.. అలుగుపై 13 గేట్లను ఏర్పాటు చేయడంతో 32.6 అడుగుల స్థాయికి పెరిగింది. ఆనాటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండినప్పుడల్లా గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.
6.5 టీఎంసీలు వృథా..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ వానాకాలం 6.5 టీఎంసీల నీరు వృథా అయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలుగా ఉంది. ఈ ఏడాది వానాకాలంలో 10.2 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఇందులో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలల్లో గేట్లను తెరవడం ద్వారా 6.5 టీఎంసీల నీరు వాగులోకి వృథాగా పారింది. ఇక 1.30 టీఎంసీల నీరు వానాకాలం పంటలకు, తాగునీటి అవసరాలకు వినియోగించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 32.4 అడుగులుగా ఉండగా.. నీటి సామర్థ్యం 2.24 టీఎంసీలుగా ఉంది.
భారీగా వరద చేరింది..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు గేట్లను బిగించి 40 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో భారీగా నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు ఇదే. ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్ల నీరు ప్రాజెక్టుకు చేరింది. ఇందులో మూడింతలకు పైగా 6.5 టీఎంసీల నీటిని వాగులోకి వదిలాం. 1.30 టీఎంసీల నీటిని వానాకాలం పంటలకు, తాగునీటికి వాడుకున్నాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.24 టీఎంసీల నీటిమట్టం ఉంది.
– ప్రతాప్‌సింగ్ ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నీటి విడుదల
గేట్ల ద్వారా 6.5 టీఎంసీలు దిగువకు
సాగు, తాగునీటి కోసం మరో 1.30 టీఎంసీలు వినియోగం
ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్లు అధికంగా వరద


