కొనసాగుతున్న ‘నెట్టెంపాడు’ పంపింగ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం 552 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిదిలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఆవిరి రూపంలో 24 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కుడి కాల్వకు 390 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,514 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.214 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఆర్డీఎస్ కాల్వపై
గుర్తు తెలియని మృతదేహం
మానవపాడు: మండల కేంద్రం శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ చంద్రకాంత్ వివరాల ప్రకారం.. మానవపాడు శివారు ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గల ఆర్డీఎస్ కాల్వ పక్కనే గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభించిందన్నారు. మృతురాలు పసుపు పచ్చ జాకెట్ ధరించి ఉందని, సూమరు 70 ఏళ్లకు పైగా వయస్సు ఉండొచ్చని, ఎవరైనా గుర్తిస్తే మానవపాడు పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70288 ను సంప్రదించాలని కోరారు.


