రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మహబూబ్‌నగర్ రూరల్: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సహకార సంఘం 72వ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో (ఏడు రంగుల) జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసిందన్నారు. సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా ఖాతాదారులకు, రైతులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంట రుణాలతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతం కోసం సహకార సంఘాల వాటాదారులు, సహకార బ్యాంకు ఖాతాదారులు పాటుపడాలని కోరారు. అనంతరం రైతులతో కలిసి ఆయన సహకార గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ
పాలమూరు: నియోజకవర్గంలో ఉండే తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం సొంత నిధులతో హెల్త్‌కిట్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలోని గైనిక్ విభాగంలో శుక్రవారం 12 మంది బాలింతలకు ఎమ్మెల్యే హెల్త్‌కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి 30 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే నియోజకవర్గానికి చెందిన ప్రతి బాలింతకు హెల్త్‌కిట్ అందిస్తామన్నారు. జనరల్ ఆస్పత్రిలో భద్రత చర్యలను మరింత పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నామని, సీసీ కెమెరాలు, గస్తీ సిబ్బంది, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలు అమల్లోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, డాక్టర్ సునీల్, గైనిక్ హెచ్‌ఓడీ ప్రసన్నలక్ష్మి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గతేడాది మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బిల్లులను వెంటనే ఇవ్వా లని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ డి మాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బిల్లులు రాకపోవడంతో రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్‌ఎస్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 17వ తేదీన చలో హైదరాబాద్‌లో భాగంగా ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు పెద్ద సంఖ్యలో మహాధర్నాకు హాజరుకావాలని కోరారు. రాష్ట్ర సంఘం కార్యదర్శి కేసీ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌స్వామి, సురేష్‌కుమార్, బాలస్వామి, అచ్చిరెడ్డి, బుచ్చిరెడ్డి, అంజిలయ్య పాల్గొన్నారు.
17న ఉమ్మడి జిల్లా ఖోఖో ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 17వ తేదీన ఉమ్మడి జిల్లా ఖోఖో జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, ఖోఖో నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్‌చార్జీలు నిరంజన్ యాదవ్, సామ రమేష్ ఎంపికలు నిర్వహిస్తారని, మిగతా వివరాల కోసం 9553124166, 9493450450, 9133148136 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


