ఠాణా నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
● అనంతపురం జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన కల్వకుర్తి పోలీసులు
● నేడు కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. రాత్రి తప్పించుకున్న వైనం
● పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు
కల్వకుర్తి టౌన్: దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీని కల్వకుర్తి పోలీసులు విచారణ నిమిత్తం తీసుకొని రాగా అతను పోలీస్‌స్టేషన్ నుంచి పరారైన ఘటన చోటుచే సుకుంది. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఓ ఇంట్లో 2022లో చోరీ చేసిన ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా కర్నూలుకు చెందిన నాగిరెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని పీటీ వారెంట్‌పై కల్వకుర్తి పోలీసులు ఈనెల 11వ తేదీన విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తిలో విచారణ ముగియడంతో శుక్రవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ క్రమంలో గురువారం రాత్రి నాగిరెడ్డి 10.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడి కొరకు వెతికినా దొరకలేదు.
బాత్రూం కిటికీలో నుంచి దూకి..
పోలీస్‌స్టేషన్‌లో 11వ తేదీ నుంచి విచారణ చేస్తున్న నాగిరెడ్డి రెండు రోజులుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదని సమాచారం. విచారణ సమయంలోనే అతడు పోలీస్‌స్టేషన్ పరిసరాలను గమనించి పూర్తి రెక్కీ వేసి ఎలా తప్పించుకోవడంపై ప్రణాళిక రూపొందించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం రాత్రి నిందితుడు నాగిరెడ్డికి భోజనం తెచ్చిన పోలీసులు.. తిని, బాత్‌రూమ్‌కు వెళ్లాలని సూచించారు. అయితే అనంతపురం జైలులో ఉన్నప్పుడే ఓ ప్రమాదం జరిగి గాయపడడంతో నడుముకు బెల్టు, చేతికి కట్టుకొని ఉన్నాడు. దీంతో అతనూ ఎలాగో తప్పించుకోలేడన్న భావనతో నిందితుడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాత్‌రూంకు పంపించారు. 20 నిమిషాల సమయం గడిచినా బాత్‌రూం నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో తలుపును బలవంతంగా తెరిచి చూశారు. బాత్‌రూం కిటికీ నుంచి బయటికి దూకి పారిపోయినట్లు గుర్తించారు. కాగా.. పూర్తి గాయాలతో ఉన్న ఖైదీ ఎలా పారిపోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని వెతికే పనిలో ఉండగా, ఇప్పటికే రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితుడు నాగిరెడ్డిపై రెండు తెలుగు రాష్ట్రాలలో 45 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
కాగా.. నిందితుడు నాగిరెడ్డిని కల్వకుర్తి తీసుకొచ్చిన తర్వాత బాధితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రెండు రోజుల కిత్రం విష్ణువర్ధన్‌రెడ్డి అనే బాధితుడు వచ్చి తన ఇంటి సీసీ కెమెరాలో రికార్డయిన వ్యక్తి, నిందితుడు ఒక్కడేనని గుర్తించాడు. అయితే అతడే పారిపోయాడా.. ఎవరైనా తప్పించారా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఠాణా నుంచి రిమాండ్ ఖైదీ పరారీ


