‘ఇందిరమ్మ’కు ‘ఉపాధి’!
● జాబ్‌కార్డున్న లబ్ధిదారుడికి పనుల కల్పనకు ప్రణాళిక
● 90 రోజుల పని దినాల వేతనం ఖాతాల్లో జమ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి పని కల్పించనున్నారు. జాబ్‌కార్డు ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారుకు 90 రోజులు పని కల్పించి వేతన డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. తన సొంతింటికి కూలీ పనులు చేసుకున్నట్లయితే వేతనం కింద రూ.307 ఉండగా.. గరిష్టంగా 90రోజులకు రూ.27,630 చెల్లించనున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇల్లు బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబు వేసే వరకు 50 రోజుల పనిదినాలు కల్పించనున్నారు.
● జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరై జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జాబ్‌కార్డు ఉన్నట్లయితే.. ఉపాధి హామీ కింద పనులు కల్పించాలని ఆదేశించారు.
లబ్ధిదారులను గుర్తిస్తున్నాం..
జాబ్‌కార్డు కలిగి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఆయా లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి ఇంటికి అవసరమైన పనులు చేసుకుంటే కూలీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూస్తాం.
– నర్సింహులు, డీఆర్‌డీఓ


