ఏసీబీ కలకలం..!
మహబూబ్‌నగర్ క్రైం/జడ్చర్ల/వనపర్తి: గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడిన, ఏసీబీ అధికారుల బృందాలే కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగించి హెచ్చరించినా రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి కట్టడి కావడం లేదు. దీంతో మరోసారి వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై భారీగా ఫిర్యాదులు అందడంతో ఏసీబీ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8 మంది సిబ్బందితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి దాటే వరకు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్స్ రైటర్లతో పాటు కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ బృందం మెరుపు సోదాలు చేసేందుకు కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. వారు వచ్చే సరికే డాక్యుమెంట్ రైటర్స్ 8 మంది మాత్రమే ఉండగా.. మిగిలిన వారు సమాచారం తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్స్‌తో పాటు కార్యాలయ సిబ్బంది ఫోన్లు తీసుకొని వాటి ద్వారా జరిగిన ఆన్‌లైన్ లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇటీవ ల జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు కంప్యూటర్‌లలో తనిఖీ చేశారు. అర్ధరాత్రి దాటినా తనిఖీలు కొనసాగిస్తామని, అన్ని రకాల వివరాలు సేకరిస్తామని డీఎస్పీ బాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. డాక్యుమెంట్స్ రైటర్స్ నుంచి రూ.20 వేల నగదు, ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.4 వేల నగదు గుర్తించినట్లు వెల్లడించారు. తనిఖీలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.
● వనపర్తి సబ్‌రిజిస్ట్రార్ చంద్రశేఖర్‌రెడ్డి నివాసం జడ్చర్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టారు. స్థానిక సరస్వతీనగర్ కాలనీలోని ఆయన ఇంటిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఏకే జిలానీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించారు. ఒక్కసారిగా ఇంత మంది ఏసీబీ అధికారులు వనపర్తికి రావడంతో విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. ముందే అందరి ఫోన్లు తీసుకోవడంతో కార్యాలయంలో లోపల ఏమి జరుగుతుందేమోననే ఉత్కంఠ కొనసాగింది.
వనపర్తి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోఏసీబీ బృందం సోదాలు
అర్ధరాత్రి దాటినా... కొనసాగిన అధికారుల తనిఖీలు
సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లుస్వాధీనం, రూ.24 వేల నగదు గుర్తింపు
అన్ని కోణాల్లో విచారణ: ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ
ఏసీబీ కలకలం..!
ఏసీబీ కలకలం..!


