యువకుడి ఆత్మహత్య
మల్దకల్: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలోని సద్దలోనిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మరి ఆటో తిమ్మప్ప, రమాదేవికి ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వంశీ(21) డిగ్రీ వరకు చదువుకుని ఇటీవల కుటుంబ సభ్యులకు చేదోడుగా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొంత కాలంగా కడుపునొప్పి బాధపడుతుండేవాడని, కడుపునొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
చికిత్స పొందుతూ.. వివాహిత మృతి
పాన్‌గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మహిళ మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిక్కేపల్లి గ్రామానికి చెందిన పికిలిచెన్నమ్మ (45) వివాహిత మహిళ వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబాన్ని మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, మాజీసర్పంచ్ బాలస్వామియాదవ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట ధనుంజయ్‌రెడ్డి, డా.సురేష్‌యాదవ్ పాల్గొన్నారు.
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
గద్వాల క్రైం: కృష్ణానదిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. గద్వాల పట్టణానికి చెందిన సలీం(15) బుధవారం రేవులపల్లి సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నేహితులతో కలసి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఆత్మకూర్: మండలంలోని తిప్డంపల్లి ఊకచెట్టువాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ జయన్న తెలిపారు. గురువారం గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు.. ఊకచెట్టువాగులో సుమారు 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆకుపచ్చ టీ షర్టు, చేతిపై బుజ్జీ అని ఇంగ్లిష్‌లో టాటు ఉంది. మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చూరికి తరలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఆత్మకూర్ పోలీసులను సంప్రదించాలని, లేదా సెల్ 87126 70631 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
యువకుడి ఆత్మహత్య


