చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
అచ్చంపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన అచ్చంపేటకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో 11వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 13 పాఠశాలల విద్యార్థులు 1,105 మంది హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యారంగంతో పాటు క్రీడలను ప్రోత్సహించేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను పెంచిందన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే వేడుకలో క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ బాలస్వామి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ సీతారాం, ప్రిన్సిపాల్ బాలస్వామి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ సద్దాంహుస్సేన్, పీడీలు వెంకటేశ్వర్లు, ఆదిబాబు, పీఈటీలు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి


