గుప్తనిధుల తవ్వకాల కలకలం
అమ్రాబాద్: పదర మండలం రాయలగండిలో వెలిసిన లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కురిసిన ముసురు వర్షాలకు దుండగులు ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పక్కన గండదీపాలు ఉంచే కట్టడాన్ని తొలగించి తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని విడిది శాల గదుల్లో పోశారు. తవ్విన గోతిపై ఎవరికి అనుమానం రాకుండా గోతిపై బండను ఉంచారు. అయితే తవ్వకాలకు సంబంధించి గుసగుసలు బయటకురావడంతో గురువారం వివిధ సంఘాల నాయకులు నాసరయ్య, బాలకిష్టయ్య, వెంకటేష్, బాలయ్య, శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు ఆలయం వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇంత జరిగినా ఆలయ పూజారి బయటకు చెప్పక పోవడంపై అనుమానాలకు తావిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పదర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


