ప్రైవేటు కళాశాలల బంద్
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన65 డిగ్రీ, పీజీ, ఫార్మా కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం
అందించిన యాజమాన్యాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఉన్నత విద్య అందిస్తున్న పలు ప్రైవేటు కళాశాలలు సోమవారం మూతబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలను రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఈ మేరకు డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలల యాజమాన్యాలు జిల్లాకేంద్రంలో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. పీయూ పరిధిలో మొత్తం 65 ఉన్నత విద్య అందిస్తున్న కళాశాలలు ఉండగా.. వీటితోపాటు రెండు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారు కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెల 8 నుంచి పీయూ పరిధిలోని పలు కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. బంద్ నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది.
వీసీకి వినతిపత్రం..
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు కళాశాలలు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో యాజమాన్యాలు పాలమూరు యూనివర్సిటీకి వెళ్లి వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం ప్రభుత్వం దసరా, దీపావళికి రూ.300 కోట్ల వరకు విడుదల చేస్తామని చెప్పి.. చేయలేదని, వీటితోపాటు మిగిలిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్ పరీక్షల వరకు బంద్ కొనసాగితే పరీక్ష అంశాన్ని కూడా పరిశీలించాలని విన్నవించారు. కార్యక్రమంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం సంఘం అధ్యక్షుడు జహీర్ అక్తర్, కార్యదర్శి జయరామయ్య, ట్రెజరర్ రజనీకాంత్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
