అధికారులు హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలను వారికి కేటాయించిన విధంగా జిల్లా అధికారులు ప్రతినెలా మొదటి వారంలో తనిఖీ చేసి విద్యా ఐ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోని లబ్ధిదారులను రద్దు చేసి వారి స్థానంలో స్థానిక ఎమ్మెల్యే, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో చర్చించి కొత్తగా ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.
ప్రజావాణికి 73 ఫిర్యాదులు..
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై 73 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని స్వీకరించిన అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, సమస్యలను నేరుగా విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని, అవసరమైతే ఫీల్డ్ పరిశీలన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
