కురుమూర్తిస్వామి హుండీ ఆదాయం రూ.28.7 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన హుండీని ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు. ఈ ఉత్సవాల్లో మొదటిసారి హుండీ ఆదాయం రూ.28,70,536 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. కురుమూర్తిస్వామి జాతరను పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు ఆలయ మెట్లపైన, స్వామివారి పాదుకల వద్ద, ఆలయ సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువన దాసంగాలు పెట్టి, గండదీపాలు మోశారు. తలనీలాలు సమర్పించారు. అనంతరం అలివేలు మంగమ్మ, ఉద్దాల మండపం, ఆంజనేయ స్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారి రఘునాథ్, పాలక మండలి సభ్యులు వెంకటేశ్వర్లు, భారతమ్మ, గోపాల్, రాములు, శేఖర్, భాస్కరచారి, ప్రభాకర్‌రెడ్డి, అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, అనంత విజయ్, లక్ష్మీనర్సింహ, సేవా సమితి మహిళలు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
