మృతదేహంతో రోడ్డుపై నిరసన
గోపాల్‌పేట: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో రోడ్డుపై నిరసన చేసిన ఘటన ఆదివారం ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజేనేయులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుడు ఏదుల ప్రాజెక్టులో మినుముల పంట సాగు చేశాడు. సాగు చేసుకున్న మినుముల పంటలో నుంచి టిప్పర్లు, లారీలు వెళ్లడంతో పాటు రిజర్వాయర్ పనులు చేసేందుకు అడ్డుపడుతున్నాడని కాంట్రాక్టర్ ఆంజనేయులుపై కేసు పెట్టి పోలీసులతో వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, రాచాల యుగంధర్‌గౌడ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ధర్నా వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సాయంత్రం వరకు రిమాండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒప్పించేందుకు ప్రయత్నించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరగా.. కాంట్రాక్టర్ రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణ తెలిపారు.


