అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
● 5.5 గ్రాముల ఆభరణాలు, రూ.1.20 లక్షలు స్వాధీనం
● రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు సీజ్
గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్ల తలుపులు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి 5.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. శనివారం సాయంత్రం గద్వాల సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. కొన్ని రోజులుగా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటకు చెందిన కుర్వ చిన్న వెంకన్న, మొర్రి ప్రణేష్, కర్ణాటకకు చెందిన కుర్వ గిరీష్, చంద్రశేఖర్ నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను పట్టుకునేందుకు గద్వాల సీఐ శ్రీను ఆధ్వర్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి, జిల్లాలో నిఘా పెంచామని తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్దకల్ పోలీసులు మండల శివారులో వాహనాలు తనిఖీ చేపట్టిన క్రమంలో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కేసు చేధనలో ఎస్‌ఐలు నందికర్, శ్రీకాంత్, శ్రీనివాసులు, శ్రీహరి, సిబ్బంది కృషి చేశారన్నారు. వీరికి నగదు రివార్డును ఎస్పీ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, బైక్‌లు, సెల్‌ఫోన్లను త్వరలో కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందజేస్తామన్నారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ నందికర్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


