మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

Oct 26 2025 8:33 AM | Updated on Oct 26 2025 8:33 AM

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హన్వాడ: జిల్లాలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి మొదటి ప్రాధాన్యత ఇస్తానని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందించిన చేపపిల్లల పంపిణీని కలెక్టర్‌ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన మండలంలోని ఇబ్రహీంబాద్‌ గ్రామం హేమసముద్రం చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా ఇతరులకు మత్స్య శాఖను కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మత్స్యకారుడినైనా తనకు ఆ శాఖను కేటాయించి, మత్స్యకారుల సంక్షేమంపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.125 కోట్ల బడ్జెట్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. జిల్లాలో ప్రధానంగా నీటి వనరులున్న ప్రాజెక్టులు, చెరువులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చేపలతోపాటు రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా మత్స్యకార సంఘాలకు రవాణా వాహనాలను ప్రతి సంఘానికి అందించేందుకు కృషిచేస్తానని, ఇందుకు ఎన్ని నిధులైనా తెస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఎండుచేపలను పౌడర్‌ రూపకంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కోల్డ్‌ స్టోరేజ్‌ లేని కారణంగా చాలామంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ప్రతి జిల్లాకు కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్న ప్రభుత్వానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు హేమసముద్రం చెరువులో రూ.2.70 లక్షల విలువైన 1.80 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీష్‌ చైర్మన్‌ సాయికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ.వెంకటేష్‌, ఏఎంసీ చైర్మన్‌ బెక్కరి అనిత, వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజ్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రి, కృష్ణయ్య, మహేందర్‌, ఆంజనేయులు, యాదయ్య, నవనీత, శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement