హైజెనస్ కంపెనీతో పీయూ ఎంఓయూ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: హైజెనస్ బయోస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో పీయూ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ జీఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎంఓయూ ద్వారా రీసెర్చి, ప్రాక్టికల్స్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వీటి ద్వారా భవిష్యత్‌లో ఉద్యోగాలు సాధించే అవకావం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంపెనీ ప్రతినిధులు సూర్యవెంకటసుబ్బరాజు, లియో డానియల్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
డీపీఆర్‌ఓలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా పౌర సంబంధాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్‌ఓ), పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. మార్చి 31, 2026 వరకు పనిచేసేందుకు ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏపీఆర్‌ఓ (1), పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్–1) అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీఆర్‌ఓ పోస్టుకు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్‌లో అనుభవం ఉన్నవారికి, అలాగే పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్) వారికి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఫొటోగ్రఫీలో డిప్లొమా లేదా జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్‌లో గుర్తించిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూషన్ నుంచి డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీఆర్‌ఓ పోస్టుకు నెలకు రూ.36,750, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.27,130 గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు వచ్చే నెల 1లోగా కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయం రూం నం.106లో దరఖాస్తు అందజేయాలన్నారు.
నేడు బల్మూరుకుగవర్నర్ రాక
అచ్చంపేట రూరల్: బల్మూర్ మండలంలోని చంద్రారెడ్డి గార్డెన్‌లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఆదివాసీ చెంచుల సామూహిక వివాహాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బయలుదేరి మధ్యాహ్నం సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్తారని ప్రకటనలో పేర్కొన్నారు.


