
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజల ఆరాధ్య ధైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఉదయం 8 గంటలకు అవాహిత దేవతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బేరిపూజ, 108 అష్టోత్తర కలశాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కురుమూర్తి స్వామి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతన పట్టు వస్త్రాలు, బంతి, మల్లెపూలతో పూజారులు అలంకరించారు. అక్కడి నుంచి కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల నడుమ కురుమూర్తి స్వా మి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కురుమూర్తిగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దంపతులు, ప్రధాన అర్చకులు వెంకటయ్య, నర్సింహులు, కమిటీ సభ్యులు భాస్కరచారి,బాదం వెంకటేశ్వర్లు, భారతి, కమలాకర్ శేఖర్‌తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా స్వామివారి కల్యాణం

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం